మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:13 IST)

మా ఓటు కావాలా? అయితే అలా చేయాల్సిందే.. ఓటర్ల వార్నింగ్

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఓటర్లు కూడా డిమాండ్ చేయగలిగే రోజులు వచ్చేసాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరాక్షి జిల్లాకు చెందిన 68 గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయకుంటే తాము ఓట్లు వేయమని హెచ్చరించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మోరీ‌పురేల ప్రాంతంలోని 68 గ్రామాలకు పవర్ గ్రిడ్ నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మునిగిపోయాయి. దీంతోపాటు గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు లేవు. 'మంత్రిగాని లేదా ఎమ్మెల్యేగాని తమ గ్రామాలకు రావడం లేదు. వారు వచ్చినా అతిథి గృహాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించడం లేదు. అందుకే మేం లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తాం' అని స్థానిక గ్రామస్థులు ప్రకటించారు.
 
తమకు కనీస వైద్యం అందడం లేదనీ, అనారోగ్యం పాలైతే తాము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే తాము ఈ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు. మరి వీరి ఓట్ల కోసం నాయకులు ఏం చేయనున్నారో చూద్దాం...