శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (08:21 IST)

డీజే శబ్దానికి ఆగిన వరుడు తండ్రి గుండె.. ఎక్కడ?

deadbody
నిశ్చితార్థం కోసం వచ్చిన వరుడు తండ్రి గుండె డీజే శబ్దానికి ఆగిపోయింది. దీంతో పెళ్లి ఇంటి విషాదం నెలకొంది. ఈ ఘటన ఒరిస్సాలోని మల్కన్‌గిరిలో బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన అంకిత్‌కు ఒరిస్సాలోని మల్కన్‌గిరికి చెందిన ఓ  యువతి సోషల్ మీడియాలో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, ముందుగా నిశ్చితార్థం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. 
 
దీంతో నిశ్చితార్థం కోసం వరుడుతో పాటు అతని కుటుంబ సభ్యులు కలిసి ఢిల్లీ నుంచి బయలుదేరి మల్కన్‌గిరికి వెళ్లారు. అక్కడ ఓ లాడ్జీలో బస చేశారు. ఆ తర్వాత లాడ్జీ నుంచి నిశ్చితార్థం జరిగే తమ ఇంటికి వరుడు కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు వధువు తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా డీజే, మేళతాళాలతో లాడ్జీ వద్దకు చేరుకున్నారు. 
 
ఈ క్రమంలో డీజేను ఒక్కసారిగా ఆన్ చేయడంతో ఆ శబ్దానికి వరుడి తండ్రి మహేంద్ర రహోలి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. దీంతో నిశ్చితార్థం జరగాల్సిన చోటు విషాదం నెలకొంది. సమచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఢిల్లీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.