శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (10:24 IST)

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకే నరబలి ఇచ్చాను..

ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మాత్రం కనుమరుగు కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే దేవతలను సంతృప్తి పరచాలంటూ ఓ వ్యక్తిని పూజారి బలిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశా కటక్‌ జిల్లాలోని బందహుడా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
 
బుధవారం రాత్రి సరోజ్‌ కుమార్‌ ప్రధాన్‌(52)ను పదునైన గొడ్డలతో 72ఏళ్ల పూజారి సన్సారీ ఓజా తల నరికి హతమార్చాడు. గురువారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు నేరం తానే చేసినట్లు ఓజా అంగీకరించాడు. కరోనా వైరస్‌ పోవాలంటే నరబలి ఇవ్వాలని తనకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని పోలీసుల విచారణలో ఓజా తెలిపాడు. 
 
ఘటన సమయంలో నిందితుడు ఫూటుగా తాగున్నాడని, ఉదయం తప్పు తెలుసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.