గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (17:20 IST)

శ్రీవారి భూముల విక్రయంపై తితిదే పాలక మండలి కీలక నిర్ణయం!!

శ్రీవారికి దాతలు ఇచ్చిన భూములు, కానుకల విక్రయంపై తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) పాలక మండలి అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లోనూ దేవస్థాన ఆస్తులు, భక్తులు సమర్పించిన కానుకలను విక్రయించకూడాదని తీర్మానం చేసింది. 
 
అదేసమయంలో దేశ వ్యాప్తంగా వివిధ చోట్ల నిరుపయోగంగా ఉన్న శ్రీవారి అస్తులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీలో పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులు ఉంటారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
నిజానికి ఇటీవల తితిదే ఆస్తుల విక్రయం అంశం పెను దుమారమే రేపింది. కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో సైతం నిరసనలు తెలిపేందుకు విపక్షాలు సిద్ధపడ్డాయి. ప్రతికూల స్పందనలతో వెనుకంజ వేసిన సర్కారు టీటీడీ ఆస్తుల విక్రయం నిలుపుదల చేస్తూ జీవో జారీ చేయగా, 
 
తాజాగా టీటీడీ పాలకమండలి కూడా ఆస్తులు అమ్మరాదంటూ తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ భూములు, ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా టీటీడీ కూడా దీనిపై తీర్మానం చేసిందని వివరించారు.
 
టీటీడీ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. పాలకమండలిపై మరోసారి ఆరోపణలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించిందన్నారు. 
 
డొనేషన్‌ విధానంలో అతిథి గృహాలను కేటాయిస్తామని, దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని టీటీడీ ఈవోని ఆదేశించామని చెప్పారు. దేవస్థానం ఆధ్వర్యంలోని చిన్నపిల్లల ఆస్పత్రిని తక్షణమే ప్రారంభిస్తామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగించిన తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు.
 
ఇదే అంశంపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 'టీటీడీ భూములు అమ్మాలని గత పాలకమండలి తీర్మానం చేసింది. దాన్ని మేం తిరస్కరిస్తూ తాజా తీర్మానం చేశాం. టీటీడీ ఆస్తులు, శ్రీవారి ఆస్తులు, భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తుల్లో వేటినీ అమ్మబోం' అని వైవీ స్పష్టం చేశారు. 
 
భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని, నిరుపయోగంగా పడివున్న ఆస్తుల పరిరక్షణకు ఓ కమిటీ వేస్తామని, ఇందులో టీటీడీ బోర్డు సభ్యులు, ప్రముఖ స్వామీజీలు, భక్తులు కూడా సభ్యులుగా ఉంటారని తెలిపారు.