శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (11:47 IST)

#OperationKashmir ఉద్రిక్తత - అమర్నాథ్ యాత్ర రద్దు - భారీగా బలగాలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉద్రిక్తవాతాణం నెలకొంది. శనివారం ఉదయం శ్రీనగర్‌లో ఓ ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. పైగా, కాశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఐదుగురు జైషే మొహ్మద్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పైగా, జమ్మూకాశ్మీర్‌కు అదనపు బలగాలను కేంద్రం తరలిస్తోంది. అలాగే, అమర్నాథ్ యాత్రపై దాడి చేసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు రావడంతో ఈ యాత్రను కూడా కేంద్ర ప్రభుత్వం అర్థాంతరంగా రద్దు చేసింది. అలాగే, శ్రీనగర్‌లోని ఎన్.ఐ.టికి నిరవధిక సెలవులను యాజమాన్యం ప్రకటించింది. 
 
హిందువులు ఎంతో పవిత్రంగా భావించి చేపట్టే అమర్నాథ్ యాత్రపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర ముష్కరులు గురిపెట్టి అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐఈడీలు, మారణాయుధాలు పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో యాత్రను కుదించుకుని, 'వెంటనే' కాశ్మీరును విడిచి స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాలని యాత్రికులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 
 
అలాగే, సెలవులో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీలైనంత త్వరగా విధులకు హాజరు కావాలని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆదేశించారు. పాకిస్థానీ ఉగ్రవాదులు అమర్నాథ్‌ యాత్రపై దాడులకు కుట్ర పన్నిన నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ అప్రమత్తం అయింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమైంది. బలగాల తరలింపునకు కేంద్రం తొలిసారి యుద్ధ విమానాలను, హెలికాఫ్టర్లను వినియోగిస్తోంది.