గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (17:52 IST)

ఆగిన నిర్భయ దోషుల ఉరి ... తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు...

నిర్భయ కేసులో దోషులకు అమలు చేయాల్సిన ఉరిశిక్షలు మరోమారు ఆగాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ శిక్షలను అమలు చేయొద్దని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో నిర్భయ ముద్దాయిలకు మంగళవారం ఉదయం ఆరు గంటలకు అమలు చేయాల్సిన ఉరిశిక్షలను తాత్కాలికంగా వాయిదా పడింది. 
 
అంతకుందు.. నిర్భయ దోషుల తరపు న్యాయవాదికి కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. నిప్పుతో చెలగాటమాడుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది. నిజానికి మంగళవారం అంటే మార్చి మూడో తేదీ ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్‌లకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేయాల్సివుంది. 
 
ఈ తరుణంలో తమ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో వారి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. రాష్ట్రపతికి తాను క్షమాభిక్ష పెట్టుకున్నానని, ఈ నేపథ్యంలో రేపటి ఉరితీత అమలును ఆపివేయాలంటూ పవన్ గుప్తా ఆ పిటిషన్‌లో కోరాడు. 
 
పిటిషన్‌ను విచారించిన పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా... తీర్పును రిజర్వులో ఉంచుతూ, పవన్ తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నలుగురు దోషుల్లో ఏ ఒక్కరు తప్పుగా వ్యవహరించినా పరిస్థితులు మారుతాయని... ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసని అన్నారు.
 
మరోవైపు పవన్ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు అయిపోయాయని సుప్రీం వ్యాఖ్యానించింది. అలాగే, దోషి పవన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో మంగళవారం ఉదయం ఉరిశిక్షల అమలు తథ్యమని అందరూ భావించారు. అయితే, ఢిల్లీ కోర్టు తదుపరి ఆదేశాలు వెల్లడించేవరకు శిక్షలను అమలు చేయొద్దని ఆదేశించింది.