శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (09:24 IST)

విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి... టెస్టులు పెంచాలంటూ ప్రధాని ఆదేశం!

narendra modi
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చడీచప్పుడు లేకుండా చాపకింద నీరులా వ్యాపిస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం ప్రధానంమత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజు వారీగా చేసే కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, దేశంలోనేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. 
 
ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, శుభ్రతను పాటించాలని కోరారు. కరోనా మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడేవారు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన తెలిపారు. ఇలాంటి వారు రద్దీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. 
 
కరోనా వ్యాప్తిని ఐదంచెల వ్యూహంతో కట్టడి చేయాలని కోరారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, మాస్కులు, తదితర జాగ్రత్తలు తీసుకోవడం, వేరియంట్లపై నిఘా వంటి ఐదు అంశాల ప్రాతిపదికన కరోనా ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు కరోనా శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయాలని, తద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని తెలిపారు.