మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (12:37 IST)

అపుడు చచ్చిపోవాలని అనుకున్నా.. కపిల్ శర్మ

kapil sharma
బాలీవుడ్ నటుడు, ప్రముఖ వ్యాఖ్యాత, "ది కపిల్ శర్మ షో" కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం తాను చచ్చిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనుకావడంతో దాన్ని ఎలా జయించాలో అర్థం కాక చచ్చిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. 
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం తాను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యానని దానిని ఎలా జయించాలో అర్థం కాక.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు తెలిపారు. కావాల్సినంత డబ్బు, ఫేమ్‌, చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ తాను ఒంటరితనాన్ని అనుభవించానని వ్యాఖ్యానించారు. 
 
'2017లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఫీలింగ్స్‌ని పంచుకోవడానికి నా పక్కన ఎవరూ లేరనిపించింది. అయితే, ఇది నాకు కొత్తేమీ కాదు. మానసిక ఒత్తిడిపై పెద్దగా అవగాహన లేని చోటు నుంచి నేను వచ్చాను. చిన్నతనంలోనే ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. 
 
ఆ సమయంలో నా బాధను ఎవరూ గుర్తించలేదు. డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు.. యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు.. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు అర్థంకాక ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుంది. 
 
నటీనటులకు ఇలాంటి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత.. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం తెలుసుకున్నాను. ఒక నటుడు అమాయకంగా ఉన్నాడంటే దాని అర్థం అతడు తెలివితక్కువ వాడని అర్థం కాదు. అయితే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైంది' అని కపిల్‌ శర్మ వ్యాఖ్యానించాడు.