ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (16:04 IST)

దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. పీఎం ప్రధాని హైలెవల్ మీటింగ్

pmmodi
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో భారీ వృద్ధి నమోదవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితి, ప్రజా ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల వ్యవధిలోనే 1,134 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి చేరింది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,03,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,134 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే, తాజాగా కరోనా కారణంగా ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు కొవిడ్‌తో చనిపోయారు. 
 
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95.05 కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,46,98,118మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి. మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 662 మంది కోలుకోవడంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,41,60,279కి (రికవరీ రేటు 98.79శాతం) చేరింది. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది.