'పంచతంత్రం' సమాప్తం - ధరల పెంపుపై హింట్స్ ఇచ్చిన ప్రధాని మోడీ
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తోందని అన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. అంటే మన దేశంలోనూ వీటి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటగ్యాస్, బొగ్గు లేదా ఎరువుల ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. కాగా, ఇప్పటికే ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.