శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (12:13 IST)

ఏ క్షణమైనా కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఆ రాష్ట్రాలకే ప్రాధాన్యం

కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఏ క్షణమైనా జరుగనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 
 
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చాలా ప్రణాళికబద్ధకంగా కేబినేట్‌ విస్తరణ చేపడుతున్నారు. 
 
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి మంత్రి వర్గ విస్తరణ ఇదే కావడం గమనార్హం. శాఖల తీరు మదింపు వేసిన తర్వాత తుది జాబితా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో, మాపో ప్రకటించనున్నారు. 
 
ఈ మంత్రి వర్గంలో కొత్తవారు... కాంగ్రెస్‌ నుండి బిజెపి గూటికి చేరిన మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాధిత్య సింధియా, అసోం రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి దక్కని సర్బానంద సోనోవాల్‌, చిరాగ్‌పాశ్వాన్‌తో తెగతెంపులు చేసుకుని, లోక్‌ జనశక్తి పార్టీని రెండు చీలికలు చేసిన పశుపతి పరాస్‌ ఉన్నారు. 
 
వీరితో పాటు బీహార్‌ భాగస్వామ్య పార్టీ జెడియు నుండి కనీసం ఇద్దరు చోటు దక్కుతుందని తెలుస్తోంది. జెడియు నేతలు లల్లాన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, సంతోష్‌ కుష్వాహ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీహార్‌ బిజెపి నేత సుశీల్‌ మోడీ పేరు వినిపిస్తూ ఉంది. మహారాష్ట్ర మంత్రి నారాయణ రానే, భూపేంద్ర యాదవ్‌కు కూడా మోడీ కేబినేట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయి.
 
ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికొస్తే... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుణ్‌ గాంధీ, రామ్‌ శంకర్‌ ఖతారియా, అనిల్‌ జైన్‌, రీతా బహుగణ జోషి, జాఫర్‌ ఇస్లామ్‌ వంటి వరుసలో ఉన్నారు. 
 
యుపిలో భాగస్వామి పార్టీగా ఉన్న అప్నాదళ్‌ నేత అనుప్రియా పటేల్‌ కూడా క్యాబినేట్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌ నుండి అజరు భట్‌, అనిల్‌ బలూనీలో ఒకరు, కర్ణాటక నుండి ప్రతాప్‌ సిన్హాకు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. 
 
బెంగాల్‌లోని బిజెపి నేతలకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. జగన్నాధ్‌ శంకర్‌, శాంతాను ఠాకూర్‌, నీతిట్‌ ప్రమాణిక్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరు కాకుండా భూపేంద్ర సింగ్‌ (హర్యానా), రాహుల్‌ కశ్వాన్‌ (రాజస్తాన్‌), అశ్విని వైష్ణవ్‌ (ఒడిశా), పూనమ్‌ మహాజన్‌ లేదా ప్రీతమ్‌ ముండే 9మహారాష్ట్ర), పర్వేష్‌ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.