సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:54 IST)

వాజ్‌పేయి వర్థంతి వేడుకలు : భారత ప్రగతికి అటల్ జీ బాటలు

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకలను ఆయా రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలోని వాజ్‌పేయ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ వర్థంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి సేవలను ప్రధాని నరేంద్ర మోడీ శ్లాఘించారు. దేశ ప్రజల సంక్షేమానికి, భారత ప్రగతికి వాజ్‌పేయి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తన సందేశంలో పేర్కొన్నారు. 
 
1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే. మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1996లో, 1998 నుంచి 1999వరకు ఆ తర్వాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్‌పేయి కొనసాగారు. 
 
ఆయన హయాంలోనే 1998 మే 11 -13 మధ్య భారత్‌ పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది. 1977, 1979లలో ప్రధాని మొరార్జీ దేశాయ్ క్యాబినెట్‌లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు. దేశ వ్యాప్తంగా ఇపుడు అందంగా కనిపిస్తున్న జాతీయ రహదారులకు మహర్ధశ కల్పించిది కూడా ఆయనే కావడం గమనార్హం.