శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (15:25 IST)

అయవదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : ప్రధాని మోడీ

mann ki baat
అవయవదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశవాసులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందన్నారు. 
 
ఆదివారం నిర్వహించిన 99వ 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంపైన ప్రజలను అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2013లో 5 వేలలోపు అవయవదానాలు చేయగా, 2022 నాటికి ఈ సంఖ్య 15 వేలకు పెరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. 
 
ఇలా దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతుండటం సంతృప్తికర విషయమన్నారు. పుట్టిన 39 రోజులకే కన్నుమూసిన తమ కుమార్తె అవయవాలను దానం చేసిన అమృత్‌సర్‌కు చెందిన దంపతులతో ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి దాతలు జీవితం విలువను అర్థం చేసుకుంటారంటూ అభినందించారు.
 
త్రివిధ దళాలతోపాటు వివిధ రంగాల్లో నారీ శక్తి చాటుతోన్న సత్తాను ప్రధాని మోడీ కొనియాడారు. ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందిన సురేఖ యాదవ్‌, ఆస్కార్‌ గెలుచుకున్న 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్' డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా, దర్శకురాలు కార్తికి గోంజాల్వేస్ తదితరుల ఉదాహరణలను ప్రస్తావించారు.