ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:03 IST)

వెంటిలేటర్‌పైనే ప్రణబ్ : మరింత విషమంగా ఆరోగ్యం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమంగా ఉంది. 84 యేళ్ళ ప్రణబ్‌కు ఇటీవల మెదడు రక్తనాళాల్లో క్లాట్ (గడ్డ) ఉండటంతో దానికి ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్టు ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఇటీవల నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మెదడు రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్‌కు చిన్నపాటి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ పూర్తయినప్పటి నుంచి ప్రణబ్ పరిస్థితి విషమంగా మారిందని, ప్రస్తుతం ఆయన ఇంకా వెంటిలేటర్‌‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి మంగళవారం పేర్కొంది. 
 
ఇప్పటికీ ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి మెరుగుదల కనిపించడంలేదని, వైద్య నిపుణుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా నిర్ధారణ అయింది. ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలంటూ కేంద్ర మంత్రులు, నేతలు సోమవారం నుంచే తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. 
 
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ప్రణబ్‌ కూతురు శర్మిష్ఠ ముఖర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలని ట్విటర్‌ ద్వారా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.