గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:43 IST)

మోదీపై ప్రియాంక గాంధీ ఆగ్రహం

కొత్త సాగు చట్టాలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల కన్నీళ్ళను తుడవటంపై దృష్టి పెట్టడం లేదని దుయ్యబట్టారు. ప్రపంచాన్ని చుట్టి వస్తున్న మోదీ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతుల వాదనను వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముజఫర్ నగర్‌లో కిసాన్ పంచాయత్‌ను ఉద్దేశించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 215 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు.

నిరసనలో పాల్గొంటున్న రైతులకు విద్యుత్తు, నీటి సరఫరాల్లో కోత విధించారన్నారు. రైతులపై దాడులు చేస్తున్నారన్నారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ, ఢిల్లీ సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దులుగా మారిపోయాయన్నారు.

ప్రధాని మోదీ ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తున్నారని, రైతులను కలిసి, వారి కన్నీళ్లు మాత్రం తుడవడం లేదని అన్నారు.దేశాన్ని కాపాడటానికి తమ కుమారులను సైన్యంలోకి పంపిన రైతులను ఉగ్రవాదులని అంటున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులను ఎగతాళి చేశారని, వారిని ఆందోళన జీవులని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ కన్నీటిపర్యంతం అయినపుడు, ఆ సంఘటనను సరదా సన్నివేశంగా మోదీ భావించారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాల వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం అంతమవుతుందని చెప్పారు.

ఇదిలావుండగా, రైతుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో కొత్త సాగు చట్టాల అమలును కొంత కాలంపాటు నిలిపేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాలు చెప్తున్నాయి.