శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (13:37 IST)

మోడీకి శశిథరూర్‌ ప్రశంస.. ఎందుకో తెలుసా?

కాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడిని ప్రధాని మోడీ ఖండిస్తూ ...ఆందోళన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ప్రశంసించారు. క్యాపిటల్‌ భవనంలో సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచ దేశాల నేతలు ఖండించగా.. అందులో ప్రధాని మోడీ కూడా ఉన్నారు.

గతంలో పెద్దన్న భజన చేసి...ట్రంప్‌ను పొగడ్తలతో ముంచిన మోడీ.. ప్రస్తుత ఆయన వైఖరి పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా అధికార బదిలీ చేయాలని, చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడాన్ని ఉపేక్షించమని మోడీ ట్వీట్‌ చేశారు.

దీనిపై శశిథరూర్‌ స్పందిస్తూ..డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనకు భారత్‌ దూరం అవుతుందనడానికి మంచి సంకేతం అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నుకోబడిన బైడెన్‌ పరిపాలనతో పనిచేయాలని సూచించారు.

ఈ వ్యాఖ్యలు వల్ల అమెరికాతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలకు ఏవైనా సమస్యలు వస్తాయని తాను విశ్వసించనని, ప్రధాని ఆందోళన వ్యక్తం చేయడం శుభ సూచికమని అన్నారు. ట్రంప్‌కు తాను, తమ ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నట్లు ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు.