సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (10:50 IST)

ఆడిటోరియంలో ప్రసంగిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఐఐటీ ప్రొఫెసర్.. ఎక్కడ?

deadbody
ఐటీటీ కాన్పూర్‌లో విషాదం ఘటన జరిగింది. ఆడిటోరియంలో ప్రసంగిస్తూ ఐఐటీ ప్రొఫెసర్ ఒకరు ప్రాణాలు విడిచారు. విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఆయన ప్రాణాలు విడిచాడు. ఆ ప్రొఫెసర్ పేరు సమీర్ ఖండేకర్. ఆడిటోరియం పోడియం వద్ద కుప్పకూలిపోయిన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఐఐటీ కాన్సూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ. సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కూలబడిపోయారు. నిమిషాల వ్యవధిలో అచేతనంగా మారిపోయారు. దీంతో ఆయనను సమీపంలోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు తేలింది.
 
అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో విద్యార్థులు, సహ ప్రొఫెసర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2019 నుంచి ప్రొ. ఖండేకర్ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కాగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్న ఆయన కుమారుడు తిరిగొచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
జబల్‌పూర్‌లో జన్మించిన ఆయన... ఐఐటీ కాన్పూరులో బీటెక్ చేశారు. అనంతరం, జర్మనీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్ చేశారు. 2020లో ఆయన ఐఐటీ కాన్పూర్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతిగా నియమితులయ్యారు.