పుదుచ్చేరిలో పూర్తిస్థాయి లాక్డౌన్.. ఈ నెల 23 నుంచి 26 వరకు..?
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23 రాత్రి 10 గంటల నుంచి 26 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది.
పుదుచ్చేరిలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే లాక్‌డౌన్ ఆదేశాలు వెలువడడం గమనార్హం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు నిన్న పుదుచ్చేరి అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 10 గంటలకల్లా ఇళ్లకు చేరుకునే విధంగా దుకాణదారులు తమ సమయాలను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.
హోటళ్లలో డైనింగ్ సర్వీసులు రాత్రి 8 గంటల కల్లా ముగించాలనీ.. హోం డెలివరీని 10 గంటల కల్లా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. కాగా పుదుచ్చేరిలో నిన్న కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.