గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:36 IST)

28న పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన.. రాష్ట్రపతి పాలన ఖాయమా?

పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ, దాని మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చని.. గవర్నర్‌ తమిళిసై రాష్ట్రపతి పాలన విధించే సూచనలు ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న సిఫారసు లేఖను గవర్నర్‌ తమిళసై కేంద్రానికి పంపారని, కేబినెట్‌లో ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాగా, ఆదివారం రాత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌, డిఎంకె కూటమి సభ్యుల సంఖ్య 12కి పడిపోయింది. అంతకు ముందు నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ - డిఎంకె కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రతిపక్ష కూటమికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 26కి పడిపోయింది. 
 
కానీ సోమవారం జరిగిన విశ్వాస పరీక్షకు నారాయణ స్వామి హాజరయ్యారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో స్పీకర్‌ విశ్వాసపరీక్ష జరపాల్సిందిగా ఆదేశించారు. సభ్యుల ఓట్లను లెక్కిస్తుండగానే.. తమ ప్రభుత్వం కూల్చివేసేందుకు బిజెపి కుట్ర పన్నిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తన ఎమ్మెల్యేలతో కలిసి సభ నుండి వాకౌట్‌ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపికి మారారు. మరికొందరు బిజెపిలో చేరే సూచనలు ఉన్నట్లు సమాచారం.
 
ప్రతిపక్ష బిజెపి, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కుట్రపూరితంగా తమ ప్రభుత్వాన్ని కూలదోశాయని, మాజీ గవర్నర్‌ కిరణ్‌బేడీ కూడా ప్రతిపక్షాలతో కుమ్మక్కైపోయారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణస్వామి తో పాటు ఆయన కేబినెట్‌ మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోదించారు. కాగా, ఎన్‌ఆర్‌ ఈ వ్యాఖ్యలను ఖండించింది.
 
ఇతర మిత్రపక్షాలను సంప్రదించి, బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోడీ గురువారం తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. 
 
పుదుచ్చేరిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు బీజేపీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ ర్యాలీతో పుదుచ్చేరిలో బిజెపి ఎన్నికల ప్రచారం అధికారికంగా ప్రారంభం కానుందని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ నెల 28న పుదుచ్చేరిలో పర్యటించనున్నారు.