ఈజీ మనీ కోసం ఏటీఎంలో డబ్బులు గుంజేసిన ఇద్దరు ఇంజినీర్ల అరెస్ట్
టెక్నాలజీ తెలుసుకుని ఈజీ మనీ కోసం ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేస్తున్న ఇద్దరు ఇంజనీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారికి సహాకారం అందించిన మరో ఆరుగురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన డబ్బుతో వారు బంగారం, ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పింప్రి చిన్చ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఏటీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడి డబ్బులు దొంగిలించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు నిందితుల వద్ద నుంచి 66 లక్షల రపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితును మనోజ్ సూర్యవంశీ, కిరణ్ భానుదాస్ కోల్టేగా గుర్తించారు. అందులో మనోజ్ గతంలో ఏటీఎం తయారీ కంపెనీలో పనిచేసేవాడు. ఇక, కిరణ్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉన్నప్పటికీ.. ఏటీఎంలను పగులకొట్టడంలో దిట్టగా ఉన్నాడు.
నిందితులు దొంగతనానికి పాల్పడే సమయంలో ఏటీఎంలో సీసీటీవీ కెమెరాలను కవర్ చేసేవారు. అలాగే ఏటీఎం లాక్‌ను ట్యాంపరింగ్ చేయడం, ఏటీఎం పిన్స్ దొంగిలించడం, డూప్లికేట్ తాళాతో ఏటీఎంలను ఓపెన్ చేయడం.. ద్వారా వారు చోరీలకు పాల్పడేవారు. క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ బాబర్, అతని బృందం ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానితుల వద్ద నుంచి పోలీసులు రూ. 6 లక్షలు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.