జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. పూణె విద్యార్థి టాప్
దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ 2020 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో పూణే నగరానికి చెందిన విద్యార్థి చిరాగ్ ఫాలోర్ టాపర్‌గా నిలిచారు. ఈ విద్యార్థి 396 మార్కులకుగాను 352 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇకపోతే, ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 1.6 లక్షలమంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఐఐటీ బాంబే జోనుకు చెందిన చిరాగ్ ఫాలోర్ 352 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
ఐఐటీ రూర్కీ జోన్ పరిధిలోని కనిష్క మిట్టల్ అమ్మాయిల్లో 315 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. జేఈఈ అడ్వాన్సుడు పరీక్షల్లో సాధించిన ర్యాంకులను బట్టి దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఐఐటీల్లో ప్రవేశ ప్రక్రియను జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) చేపడుతోంది.