హత్య కేసులో నిర్దోషిగా తేలిన డేరా బాబా : హర్యానా కోర్టు
డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఊరట కల్పించింది. డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. సీబీఐ కోర్టు తీర్పును కొట్టేసింది.
దీంతో ఈ కేసులో డేరా చీఫ్‌ను దోషిగా తేల్చి సీబీఐ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష తప్పినట్లైంది. అయితే, జర్నలిస్ట్ హత్య, ఆశ్రమంలో మహిళలపై లైంగిక వేధింపులు.. తదితర కేసులకు సంబంధించి కోర్టు విధించిన శిక్ష కారణంగా గుర్మీత్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి డేరా చీఫ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే.
కాగా, డేరా హెడ్ క్వార్టర్స్ లో మహిళలపై రామ్ రహీమ్ లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఓ లేఖ మీడియాకు చిక్కింది. ఈ లేఖ రాసింది డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ అని ప్రచారం జరిగింది. దీంతో 2002లో రంజిత్ సింగ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో రంజిత్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్యలో డేరా చీఫ్ రామ్ రహీమ్ పాత్ర ఉందని ఆరోపణలు వినిపించాయి. అంతకుముందు డేరా చీఫ్ అక్రమాలపై కథనం ప్రచురించిన జర్నలిస్ట్ రామ్ చందర్ ప్రజాపతి కూడా హత్యకు గురయ్యాడు.
జర్నలిస్ట్ హత్యతో పాటు మరో రేప్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత 2017లో రామ్ రహీమ్ ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించగా.. పంజాబ్ హర్యానాలలో హింసాత్మక అల్లర్లు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో మొత్తం 30 మంది చనిపోగా, 250 మందికి పైగా గాయాలయ్యాయి.
డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో రామ్ రహీమ్ తో పాటు మరో నలుగురిని సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 2021లో వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును డేరా చీఫ్ పంజాబ్ హర్యానా హైకోర్టులో సవాల్ చేయగా.. తాజాగా ఆయనను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువడింది.