1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (19:13 IST)

పూరీ జగన్నాథస్వామి ఆలయంలో భక్తులకు అనుమతి.. ఆధార్ తప్పనిసరి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి ఆలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత మూడు నెలలుగా మూసివున్న ఆలయాన్ని ఇవాళ తిరిగి తెరిచారు. అయితే, ఇవాళ్టి నుంచి ఆగస్టు 16 వరకు ఆలయ సేవకుల కుటుంబసభ్యులకు మాత్రమే జగన్నాథుని దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 
కొవిడ్ విస్తృతి నేపథ్యంలో గత ఏప్రిల్ 24 నుంచి ఆలయాన్ని మూసేశారు. ఇవాళ తిరిగి తెరిచారు. తొలి దశలో ఆలయ సేవకుల కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నామని, వారంతా దేవాలయ కమిటీ జారీచేసిన గుర్తింపు కార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును కూడా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక రెండో దశలో ఆగస్టు 16 నుంచి పూరీ నివాసితులన అనుమతిస్తామని చెప్పారు.
 
ఇక మూడో దశలో ఆగస్టు 23 నుంచి అందరూ జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అయితే వారు ఆలయానికి వచ్చే ముందు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను కానీ, కొవిడ్-19 నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టునుకానీ చూపించాల్సి ఉంటుందన్నారు. ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టు వ్యవధి దర్శనానికి ముందు 96 గంటలు మించకుండా ఉండాలని చెప్పారు. వీటితోపాటు ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకుని రావాలని సూచించారు.
 
అయితే పూరీ పట్టణంలో శని ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుంది. కాబట్టి ఆ రెండు రోజులు ఆలయ ప్రవేశానికి కూడా ఆంక్షలు అమలవుతాయని, అందుకే ప్రతి శని ఆదివారాలు జగన్నాథుడి ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు.