ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (10:38 IST)

లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ... ఎట్టకేలకు సమ్మతం

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు సమ్మతం తెలిపారు. లోక్‌సభలో విపక్ష నేతగా ఉండేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు ఒక స్థానాన్ని త్యజించారు. అదేసమయంలో రాహుల్‌ను లోక్‌సభలో కూటమి తరపున విపక్ష నేతగా ఎన్నికయ్యారు.
 
మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. వారందరూ లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు.
 
స్పీకర్ పదవి కోసం తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్న నేపథ్యంలో, ఇండియా కూటమి నుంచి విపక్ష నేత ప్రకటన వెలువడింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి అభ్యర్థికి ఇచ్చేందుకు ఎన్డీయే ససేమిరా అనడంతో, స్పీకర్ పదవికి ఎన్నిక జరపాల్సిందేనని ఇండియా కూటమి పట్టుబట్టడం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే తరపున ఓం బిర్లా బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె.సురేశ్‌ను పోటీలోకి దించింది. దీంతో పుష్కర కాలం తర్వాత లోక్‌సభలో స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనుంది.