శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:57 IST)

రాహుల్ గాంధీ త్వరలో కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష

దేశంలో పలువురు కీలకనేతలకు కొవిడ్‌ సోకుతున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత ఆనంద్‌శర్మ, కర్ణాటక సీఎం యడియూరప్ప, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తదితరులకు తాజాగా కోవిడ్‌ బారినపడ్డారు. అలాగే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కరోనా సోకింది.

స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌‌గా తేలినట్లు మంగళవారం రాహుల్‌ గాంధీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల తనను కలిసినవారు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని, సురక్షితంగా, క్షేమంగా ఉండాలని పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కరోనా బారిన పడటంపై ప్రధాని మోడీ స్పందించారు. లోక్‌సభ ఎంపీ రాహుల్‌ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ మంగళవారం మధ్యాహ్నాం మోడీ ట్వీట్ చేశారు.

ఇక, రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ట్వీట్‌లు చేశారు.