బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (10:47 IST)

భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేస్తారా? రైల్వే మంత్రి ఏమన్నారు?

ashwini vaishnav
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. రైల్వేను ప్రైవేటుపరం చేసే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, రైల్వేలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రైల్వే బోర్డు పని తీరును మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన రైల్వే (సవరణ) బిల్లు - 2024కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపిందని తెలిపారు. 
 
ఈ బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ .. ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించ వద్దని హితవు పలికారు. 
 
రైల్వే రంగాన్ని మరింత మెరుగుపరచడానికి, బోర్డు స్వతంత్రతను పెంపొందించేందుకు రైల్వే సవరణ బిల్లు తెచ్చామన్నారు. రైల్వేలను అధునీకరించడం, పటిష్టం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని, రైల్వేల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని ఆయన అన్నారు. రైల్వే సవరణ బిల్లుతో రైల్వే బోర్డు మరిన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతుందని మంత్రి తెలిపారు.