సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (12:38 IST)

రైలు ప్రమాదాల నివారణకు ఏఐ టెక్నాలజీ : రైల్వే బోర్డు నిర్ణయం

indian railway
దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఏఐ సాంకేతికతతో పని చేసే సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు. 
 
రైల్వే భద్రతపై ఆమె మాట్లాడుతూ, వచ్చే యేడాది కుంభమేళా నేపథ్యంలో సంఘవిద్రోహులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భద్రతా సంస్థలు రైల్వే ట్రాకులపై నిరంతర నిఘా ఉంచుతాయని సిన్హా, స్పష్టం చేశారు. ఈ మేరకు కుంభమేళా సన్నాహాలను సమీక్షించారు. కుంభమేళా ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
2019 కుంభమేళా సందర్భంగా సుమారు 530 ప్రత్యేక రైళ్లను నడిపారని ఆమె ప్రస్తావించారు. ఇక 2025లో జరిగే కుంభమేళా కోసం దాదాపు 900 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించారు. ఇక ఈ కుంభమేళాకు 30 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో రద్దీ నివారణకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిన్హా వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ జంక్షన్‌ను అమృత్ భారత్ స్టేషన్‌గా ఎంపిక చేశామని ఆమె వెల్లడించారు.
 
ఇక దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఆధునికీకరణ, భద్రతా చర్యల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ పట్టాలు తప్పడం, రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రస్తావించారు. కాగా గత ఐదేళ్లలో దేశంలో అనేక రైల్వే ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.