మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (13:10 IST)

భారత్‌కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్ - అమెరికాతో రాజ్‌నాథ్ మంతనాలు

చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేో చర్యల్లో భాగంగా భారత్ అంతర్జాతీయంగా మద్దతును కూడగడుతోంది. ఒకవైపు సరిహద్దుల వద్ద భారత బలగాలు చైనా బలగాలకు ధీటుగా సమాధానమిస్తున్నాయి. మరోవైపు, కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంతర్జాతీయంగా మద్దతును కూడగడుతున్నారు. ఫలితంగా భారత్‌కు ఫ్రాన్స్‌ బాసటగా నిలిచింది. 
 
లఢఖ్ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘరణలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకున్న చైనా తీరును ఫ్రాన్స్ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఖండించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఈ మేరకు సోమవారం ఒక లేఖ రాశారు. 'భారత సైనికులు, వారి కుటుంబాలకు చాలా పెద్ద నష్టం జరిగింది. ఇలాంటి కష్టసమయంలో మా దేశం, మా దేశ ఆర్మీ తరుఫున స్థిరమైన, స్నేహ పూర్వక మద్దతు తెలుపుతున్నా' అన అందులో పేర్కొన్నారు. 
 
ఈ ప్రాంతంలో ఫ్రాన్స్‌కు భారత దేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి అని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ గుర్తుచేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆహ్వానిస్తే భారత్‌కు వచ్చి ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలను వీలైనంత తొందరగా సరఫరా చేస్తామని ఫ్రాన్స్‌ ఇప్పటికే భరోసా ఇచ్చింది. 
 
మరోవైపు భారత్‌పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఇప్పటికే పలు దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. చైనా ఆగడాలను భారత్‌ ఎదుర్కొనేందుకు జర్మనీలోని తమ సైనిక దళాలను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇటీవల పేర్కొన్నారు.
 
చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మంగళవారం ఫోనులో చర్చించనున్నారు. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత్‌, చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. 
 
ప్రాంతీయ భద్రత, సహకారం, సమన్వయం వంటి అంశాలపై వారు కీలక చర్చలు జరపనున్నారు. గాల్వన్‌ లోయ వద్ద చైనా సైన్యం కొన్ని మీటర్ల మేర చొచ్చుకుని వచ్చిందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరుపుతోంది.