శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరోనా ఎఫెక్టు : దేశ చరిత్రలో తొలిసారి ఎట్ హోం రద్దు

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే, ఈ దఫా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం వేడుకను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారి. 
 
సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఉన్నాతధికారులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సుమారు రెండు వేల మందికి రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. 
 
అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రతి రోజూ 2.50 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలోనైనా ఈ వేడుకలను నిర్వహించాలని భావించారు. 
 
కానీ, అదీకూడా సాధ్యంకాలేదు. దీంతో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ సింగ్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎట్ హోం కార్యక్రమం రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.