బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (11:38 IST)

కరోనా అదృశ్య శక్తిపై పోరాటం కొనసాగించాలి : రాష్ట్రపతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై సాగిస్తున్న పోరులో భారత్ ప్రస్థానం అపూర్వమని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. దేశంలో కరోనా సంక్షోభం ముగిసేంతవరకు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా అదృశ్య శక్తిపై పోరాటం కొనసాగిస్తూనే ఉండాలని కోరారు. 
 
బుధవారం భారత 73వ గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కరోనా సమయంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని గుర్తుచేశారు. ఈ  సంక్షోభం ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. 
 
ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగు చూసిన తొలి యేడాదిలోనే వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుచుకున్నామన్నారు. రెండో యేడాదిలో వ్యాక్సిన్లు తయారు చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కోవిడ్ వంటి అదృశ్య శక్తితో పోరాటం కొనసాగిస్తూనే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 
 
వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసినప్పటికీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటి కరోనా బాధితులకు వైద్యం చేసి అనేక కోట్ల మంది ప్రాణాలను కాపాడారన్నారు. ప్రస్తుతం కరోనా నుంచి దేశం కోలుకుంటుందని, దేశానికి యువ మానవ వనరులు ఉండటం ఓ అద్భుత వరమని చెప్పారు.