పగబట్టిన కాకి... వణికిపోతున్న కూలీ
సాధారణంగా మనుషులు పగ పెంచుకుంటారు. తమకు చెడు చేసిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునేందుకు పగ పెంచుకుంటారు. అయితే, ఓ కాకి ఓ వ్యక్తిపై పగపట్టింది. తన బిడ్డను చంపేశాడన్న పగతో ఇప్పటికీ రగిలిపోతోంది. దీంతో అతను ఇల్లు వదలి బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురికి చెందిన శివ కేవత్ మూడేళ్ల క్రితం పనికి వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలో ఉన్న కాకి గూట్లో పిల్ల కాకి మూలుగు విని దాని దగ్గరకు వెళ్లాడు. గాయంతో విలవిల్లాడుతున్న కాకి పిల్లను చేతిలోకి తీసుకుని నిమురుతుండగానే అది ప్రాణాలు కోల్పోయింది.
సరిగ్గా అప్పుడే గూటికి దగ్గరకు వచ్చిన తల్లి కాకి సహా ఇతర కాకులు పిల్ల కాకిని శివ చంపేశాడని భావించాయి. ఇక ఆనాటి నుంచి అతడిపై పగబట్టాయి. ఇంట్లో నుంచి శివ బయటికి వెళ్లే సమయంలో అక్కడికి చేరుకుని రోజూ అతడిని ముక్కుతో పొడవడంతో పాటుగా కాళ్లతో ముఖం, చేతులపై దాడి చేయడం ప్రారంభించాయి.
ఆరంభంలో ఇదంతా యాధృచ్చికంగా జరుగుతోందని భావించిన శివకు రాను రాను అసలు విషయం అర్థమైంది. దీంతో వాటిని తప్పించుకుని పోయేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీకాకులు మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. దీంతో ఆయన బిక్కుబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు.