శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (09:11 IST)

పంజాబ్‌లో మార్చి 31వరకు స్కూళ్లు మూత

కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండటంతో పంజాబ్‌ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. మహమ్మారి వ్యాప్తి కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నట్టు తెలిపారు. అలాగే, సినిమా థియేటర్లు/షాపింగ్‌ మాల్స్‌పైనా పరిమితులు విధించారు. సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించారు.

కరోనా గొలుసును ఛేదించేందుకు ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.  కుటుంబ సభ్యులు/బంధువులతో పరిమిత సంఖ్యలో తమ ఇళ్లలోనే కార్యక్రమాలు జాగ్రత్తగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ నిబంధనలన్నీ రేపటి నుంచే అమలులోకి వస్తాయని వెల్లడించారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినప్పటికీ 20మందికి మించి హాజరు కావొద్దని సూచించారు.

ఆయా జిల్లాలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ మాత్రం ఆదివారం పూర్తిగా మూసే ఉంచాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టంచేశారు.