బీజేపీలో చేరిన పదిమంది ఎస్‌డీఎఫ్ ఎమ్మెల్యేలు

Last Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (11:14 IST)
గ్యాంగ్‌టక్: సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి పది ఎమ్మెల్యేలు మంగళవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసిన ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు.
 
 ఒక్క సీటు కూడ గెలుచుకోని బీజేపీ సిక్కిం రాష్ట్రంలో ఇప్పుడు అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఉంది. సిక్కింలో మాత్రం బీజేపీ ఒక్క సీటును కూడ గెలుచుకోలేదు. 
 
సిక్కిం అసెంబ్లీలో 32 స్థానాలున్నాయి. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌కు 15 స్థానాలు దక్కాయి. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో వారిద్దరూ కూడ ఒక్కో స్థానానికి రాజీనామాలు సమర్పించారు. 
 
ఈ రాజీనామాలతో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ బలం 13కు పడిపోయింది. సిక్కిమ్ క్రాంతికారి మోర్చా 17 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 
సిక్కిం డెమోక్రటిక్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది మంగళవారం నాడు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. దీంతో ఆ పార్టీ బలం మూడుకు పడిపోయింది.దీనిపై మరింత చదవండి :