డిసెంబర్ కల్లా సీరమ్ వ్యాక్సిన్: పునావాలా
పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందిస్తున్న కరోనా వైరస్ టీకా డిసెంబర్ కల్లా సిద్ధమవ్వచ్చని ఆ సంస్థ సీఈవో అధార్ పునావాలా తెలిపారు. వంద మిలియన్ డోసులు వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి అందుబాటులోకి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. టీకా అందుబాటులోకి వచ్చే సరైన సమయం యూకేలో నిర్వహిస్తున్న ట్రయల్స్, డీసీజీఐ ఆమోదం వీటిపై ఆధార పడి ఉంటుందని తెలిపారు.
''అత్యవసర అనుమతికి దరఖాస్తు చేసుకోకపోతే.. డిసెంబర్ లో క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి.. వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో వ్యాక్సిన్ ను తీసుకువస్తాం.
ఆ సమయానికి యూకేలోనూ ట్రయల్స్ పూర్తవుతాయి. టీకాపై వారి అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుని సురక్షితమేనని అనుకున్నపుడు రెండు మూడు వారాల్లో అత్యవసర అనుమతికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంటాం.
అత్యవసర అనుమతికి దరఖాస్తు చేస్తే డిసెంబర్ నాటికి టీకా అందుబాటులోకి తెస్తాం. కానీ ఆ అంశం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుంది'’ అని పునావాలా తెలిపారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ.. ‘100 మిలియన్ డోసులను అందుబాటులోకి తేవడం మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అది 2021 రెండు లేదా మూడో త్రైమాసికానికి పూర్తవుతుంది. వ్యాక్సిన్ రెండు డోసులుగా ఉంటుంది.. ఒక్కో డోసుకు మధ్య 28 రోజుల గడువు ఉంటుంది. టీకా ధర గురించి మేం ఇప్పుడే చెప్పలేం.
ఆ విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. సీరం వ్యాక్సిన్ అనువైన ధరకే లభిస్తుందనే విషయం మాత్రం చెప్పగలను’ అని అధార్ పునావాలా చెప్పారు.