తన మనసింకా అంతరిక్షంలోనే వుంది... వ్యోమగామి శిరీష బండ్ల
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఆదివారం చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఈ యాత్రలో పాలుపంచుకున్న వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన గుంటూరు జిల్లా యువతి శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు.
ప్రపంచ కుబేరుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక చారిత్రాత్మక రీతిలో అంతరిక్ష విహారం చేసి సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన విషయం తెల్సిందే. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న శిరీష బండ్ల కూడా ఈ యాత్రలో భాగమై అంతరిక్ష యానం చేసింది.
తన అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరిన తర్వాత ఆమె తన తొలి రోదసి యాత్రపై స్పందించారు. తాను పట్టరాని సంతోషంలో మునిగిపోయినట్టు చెప్పారు. అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ అద్భుతమైన అనుభూతి అని వ్యాఖ్యానించారు.
యాత్ర ముగిసి తాము భూమికి చేరినా, తన మనసింకా అంతరిక్షంలోనే ఉందని వ్యాఖ్యానించారు. అంతరిక్షానికి వెళ్లాలన్నది తన చిన్ననాటి కల అని, ఇన్నాళ్లకు అది సాకారమైందని, అది కూడా సంప్రదాయేతర మార్గంలో నెరవేరిందని శిరీష వెల్లడించారు. ఇప్పటికీ తాను రోదసిలోకి వెళ్లి వచ్చానంటే నమ్మశక్యం అనిపించడంలేదని, ఆ భావన వర్ణనాతీతం అని వివరించారు.