1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (14:33 IST)

అసోం, మిజోరాంల మధ్య ఘర్షణ: ఆరుగురు పోలీసుల మృతి

Assam
అసోం, మిజోరాం మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త ఘటనల కారణంగా ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. మరో 50 మంది పోలీసులు సిల్చర్ మెడికల్ కాలేజీలో చేరారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా షిల్లాంగ్‌లో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. సరిహద్దుల్లో ప్రభుత్వం వాహనాలపై దాడులు జరిగాయి.
 
అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈ మధ్యాహ్నం స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసింది.

ఈ నేపథ్యంలో కొందరు కాల్పులు జరపడంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టు సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. మిజోరం సరిహద్దుల నుంచి జరిపిన కాల్పుల్లోనే వారు మృతిచెందినట్లు ఆరోపించారు. ఈ కాల్పుల్లో అస్సాంలోని కాచర్‌ జిల్లా ఎస్పీ నింబల్కర్‌ వైభవ్‌ చంద్రకాంత్‌ సైతం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
 
రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు హింసాత్మకం కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తాము చర్యలు తీసుకుంటామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమిత్ షాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక అస్సాం, మిజోరం కొన్నేళ్ల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. గత నెలలో కూడా రెండు రాష్ట్రాల భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది.