సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (18:01 IST)

వినాయక విగ్రహం నుంచి నీటి చెమ్మ... క్యూకట్టిన భక్తులు

వినాయకుడు పాలు తాగిన సంఘటనలు విన్నాం. వేప చెట్టు నుంచి పాలు కారడం చూశాం. ఇపుడు వినాయకుడుకు చెమట పోస్తోంది. గణేష్ మహరాజ్ విగ్రహం నుంచి నీటి చెమ్మ కారుతోంది. దీన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. ఈ వింత దృశ్యం బీహార్ రాష్ట్రంలో కనిపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని గయలోని ఓ ఏరియాలో రాంశిల తకుర్బాదీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడాన్ని ఆలయ పూజారులు గుర్తించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి... స్థానికంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ వింతను చూసేందుకు స్థానిక భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాన్ని చేతితో తాకితే నీటి చెమ్మ తగులుతోంది. అలాగే, విగ్రహం నుంచి చెమట చుక్కలు వచ్చినట్టుగా నీరు కారుతోంది. 
 
దీనిపై స్థానిక భక్తులు స్పందిస్తూ, దేశంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలేకాకుండా దేవుళ్లు కూడా ఎండలను తట్టుకోలేక పోతున్నారనీ, అందుకే వారి శరీరం నుంచి చెమట వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ విగ్రహం చల్లదనం కోసం చందనపు పూత పూశారు. 
 
అయితే, ఈ విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడంపై నిపుణులు స్పందిస్తూ, పగడపు రాయితో తయారు చేసిన విగ్రహాలు ఎల్లవేళలా వేడిగా ఉంటాయనీ, వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ఆ విగ్రహాల నుంచి నీటి చెమ్మ రావడం జరుగుతుందని తెలిపారు.