రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా.. సాధారణ వ్యక్తిలా అమ్మ వద్ద వినతిపత్రం స్వీకరణ
ఎంకే స్టాలిన్. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆయనలో సీఎం అధికార దర్పం మచ్చుకైనా కనిపించడం లేదు. భారీ కాన్వాయ్ అంటూ ఏదీ లేదు. కేవలం ఆయన భద్రతా సిబ్బందికి చెందిన వాహనాలే ఉంటాయి. పైగా, సీఎం కుర్చీలో కూర్చొన్నది మొదలుకుని క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే మంచి ముఖ్యమంత్రి అని ప్రజలతో అనిపించుకున్నారు.
కోవిడ్ నియంత్రణకు వేసిన కమిటీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. తాజాగా ఆయన మరో సంఘటనతో వార్తల్లో నిలిచారు. తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు.
హంగుఆర్భాటాలకు దూరంగా ఉండే స్టాలిన్.. తాజాగా తన కాన్వాయ్‌ను ఆపి మరీ.. ఓ మహిళ దగ్గర ఫిర్యాదును స్వీకరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులోని పలు జిల్లాల్లో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చికి వెళ్ళే మార్గంలో ఒక మహిళ దరఖాస్తుతో రోడ్డు వెంట నిల్చొని ఎదురు చూస్తోంది.
ఈ క్రమంలో కాన్వాయ్ ముందుకు వెళుతోంది. అర్జీతో ఉన్న మహిళను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్ కాన్వాయ్‌ని ఆపించి ఆ పిటిషన్‌ను స్వీకరించారు. పైగా, వెంటనే దానిపై సంతకం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే.. అర్జీ తీసుకోవడంతో ఆ వృద్ధురాలు అనందంతో వెనుదిరిగింది. ఇదంతా సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ సంఘటనను చూసిన నెటిజన్లంతా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అభినందిస్తున్నారు.