కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)
దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఇదివరకే చెప్పామని, దానిని నెరవేర్చుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని రాహుల్ చెప్పారు.
హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలిపోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేపై తాను ఎంతో సంతోషిస్తున్నానని.. ప్రధాని మోదీ ఇంత వరకు కులవివక్ష గురించి మాట్లాడలేదు. కులగణనతో దేశంలో ఎంత మంది నిరుపేదలు ఉన్నారో తెలుసుకోవచ్చునని.. జాతీయ స్థాయిలో కులగణన చేపడుతామని పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టు రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
దేశం ఆర్థికంగా శక్తిమంతంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశం గురించి తాను నిజం చెబితే... దేశాన్ని విభజించడం అవుతుందా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.