శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 జులై 2019 (14:14 IST)

జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మిన 'శరవణ భవన్' హోటల్ ఓనర్.. వివాహితను పెళ్లాడితే..

ఆయనో హోటల్‌కు అధిపతి. ఒక్క తమిళనాడులోనే కాదు విదేశాల్లో కూడా ఆ హోటల్ శాఖలు ఉన్నాయి. పైగా, ఎంతో పేరొందిన హోటల్. ఇడ్లీ, వడ, పొంగల్, భోజనం ఇలా ఏదైనా సరే.. జిహ్వచాపల్యాన్ని తీర్చేలా ఉంటాయి. ఓ మారుమూల గ్రామంలో ఉల్లిపాయలు అమ్ముకుంటూ చెన్నైకు వచ్చిన వ్యక్తే ఈ హోటల్ యజమాని. పేరు రాజగోపాలన్ అలియాస్ శరవణా భవన్ రాజగోపాలన్. 
 
1981లో శరవణా భవన్ పేరుతో ఓ చిన్న రెస్టారెంట్‌ను చెన్నైలో ప్రారంభించాడు. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, అరబ్ దేశాల్లో పలు శాఖలను ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. అయితే, ఈ హోటల్ యజమాని ఇపుడు ఓ హత్య కేసులో చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. వచ్చే ఆదివారం నుంచి ఆయన శిక్ష మొదలుకానుంది. తన హోటల్‌లో పని చేస్తున్న జీవజ్యోతి అనే మహిళ భర్త ప్రిన్స్‌ను దారుణంగా హత్య చేయించినందుకు ఈ శిక్ష పడింది. 
 
ఈ హత్య కేసు వివరాలను పరిశీస్తే, రాజగోపాలన్‌కు అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ దఫా తన హోటల్‌లో పని చేసే మహిళ జీవజ్యోతిపై మనసుపడ్డాడు. పైగా, ఈమెను మూడో భార్యగా చేసుకుంటే అదృష్టం కలిసివస్తుందని, వ్యాపారంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవచ్చని ఓ జ్యోతిష్యుడు ఆయన్ను నమ్మించాడు. దీన్ని హోటల్ యజమాని గుడ్డిగా నమ్మేశాడు. 
 
అయితే, హోటల్ పనిచేసే మహిళకు అప్పటికే పెళ్లి భర్త కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని రాజగోపాల్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, తన మనసులోని కోరికను చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో, రాజగోపాల్‌లోని నేరగాడు బయటకు వచ్చాడు. తనను కాదన్నదన్న కోపంతో ఆమె భర్తను 2001లో దారుణంగా చంపించాడు. 
 
దీనిపై చెన్నై నగర పోలీసులు కేసు నమోదు చేయగా, కేసు విచారణ గత 18 యేళ్లకు పైగా సాగుతోంది. ఈ కేసులో కింది కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ, రాజగోపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన ధర్మాసనం, ఈ శిక్ష చాలదని, దీన్ని యావజ్జీవంగా ఖరారు చేస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో రాజగోపాలన్ యావజ్జీవ కారాగారశిక్ష వచ్చే ఆదివారం నుంచి అమలుకానుంది.