బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (09:58 IST)

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ వద్దు :ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ లకు ఆయా దేశాల ప్రభుత్వాలు అత్యవసర వినియోగం కోసం అనుమతులు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఇప్పటికే అమెరికా జపాన్ లాంటి అగ్రరాజ్యాల లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఇటీవలే భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోవడంతో మరికొన్ని రోజుల్లో భారత్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.
 
అయితే ఇప్పటికే రెండు వాక్సిన్ లకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక వ్యాక్సిన్ డోసులు ప్రతి ఒకరికి అందే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్ధేశం కూడా చేసింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా కరోనా వారియర్స్ కి వ్యాక్సిన్ అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి అన్న విషయం తెలిసిందే.
 
 ఈ నెల 16వ తేదీ నుంచి భారత్ లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. తీవ్రమైన అలర్జీ ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే బాలింతలు, 16 ఏళ్ల లోపు పిల్లలు వాక్సినేషన్ ప్రక్రియకు దూరంగా ఉండటం ఎంతో మంచిది అంటూ సూచించింది.

ఇక టీకా తీసుకున్న మహిళలు రెండు మూడు నెలల వరకు గర్భధారణకు దూరంగా ఉండాలి అని డబ్ల్యుహెచ్వో సూచించింది. ట్రయల్స్ లో హెచ్ఐవి బాధితులకు సంబంధించిన డేటా పరిమితంగా ఉందని.. ఈ విషయాన్ని ముందుగానే హెచ్ఐవి బాధితులకు తెలపాలని డబ్ల్యుహెచ్వో తెలిపింది. తగిన జాగ్రత్తల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియను జరపాలని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
 
16 ఏళ్ల లోపు వారికి వద్దు..
కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారు కచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన వారై ఉండాలని, అలా కాకుండా ఆ వయసు కంటే తక్కువ ఉండి.. ఇంకా 16 ఏళ్ల లోపు వారికి అసలు వ్యాక్సిన్ వేయవద్దని డాక్టర్లకు డబ్ల్యూహెచ్‌వో సూచించింది. 16 సంవత్సరాలలోపు వారిలో వ్యాక్సిన్‌ను తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చని, అందువల్ల వారిని వ్యాక్సిన్‌కు దూరంగా ఉంచితేనే మంచిదని పేర్కొంది.
 
అలర్జీలతో బాధపడేవారు..
కొంత మంది వ్యక్తులకు కొన్ని రకాల మందులతో అలర్జీలు ఉంటాయి. అలాంటి వారు కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఒకవేళ అలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ తీసుకుంటే వారిలో అలర్జీ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అలర్జీలతో బాధపడేవారు కచ్చితంగా వ్యాక్సినేషన్ సమయంలో డాక్టర్లకు ఈ విషయం తెలియజేయాలని, దాదాపు వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.
 
గర్భిణులకు వద్దు..
కరోనా బారిన పడే అత్యంత ప్రమాదకర జాబితాలో గర్భిణులు ఉంటారని, అయినా వారు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ట్రయల్స్ సమయంలో గర్భిణులకు సంబంధించి తగినంత సమాచారం లేనందున వీరు కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడమే ఉత్తతమమని సూచించింది. ఒకవేళ గర్బిణీ హెల్త్‌వర్కర్‌ అయివుంటే, వ్యాక్సిన్ వేసే వైద్యుడితో సంప్రదించి.. అప్పుడు మాత్రమే డోస్ తీసుకోవాలని, దాదాపు దూరంగా ఉండడమే మేలని సూచిస్తోంది.
 
ఇక బాలింతలకు, ముఖ్యంగా తల్లి పాలిచ్చే బాలింతలు కూడా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా మహిళలు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం 2-3 నెలల పాటు గర్భం దాల్చ వద్దని, అలా దాల్చితే పుట్టబోయే బిడ్డపై ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉండవచ్చని చెబుతున్నారు.
 
హెచ్‌ఐవీ రోగులకు వద్దు..
కరోనా వ్యాక్సిన్‌ను ఎట్టిపరిస్థితుల్లో హెచ్‌ఐవీ రోగులు వేయించుకోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నుంచి హెచ్‌ఐవీ రోగులకు సంబంధించిన పరిమితమైన డేటా మాత్రమే అందుబాటులో ఉందని, అందువల్ల వ్యాక్సిన్ వేసే సమయంలో డాక్టర్లకు కచ్చితంగా తాము హెచ్‌ఐవీ బాధితులైతే వెంటనే తెలియజేయాలని సూచించింది.ఒకవేళ ఎవరైనా ఈ విషయం చెప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వారిలో కరోనా విజృంభించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.