శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (09:19 IST)

20 రాష్ట్రాల్లో మూడు రోజులు భారీవర్షాలు

రాబోయే మూడు రోజుల్లో దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రెండు మూడు రోజులో్లో వాయువ్య, ఈశాన్య, ద్వీపకల్పంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వాతావరణశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
 
ఈ నెల 18, 19తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.అల్పపీడన ప్రభావం దక్షిణ తూర్పు ద్వీపకల్పంపై చూపిస్తుందని, దీనివల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ వివరించింది.

కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నందున తూర్పు భారతదేశంలో అక్టోబర్ 20 వరకు భారీ వర్షపాతం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
 
జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కింలలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశాలలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు.