ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (18:14 IST)

మరో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ సస్పెన్షన్... లోక్‌సభ నిరవధిక వాయిదా

lok sabha house
లోక్‌సభ నుంచి మరో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా గురువారం సస్పెండ్ చేశారు. ఆ తర్వాత లోక్‌సభను నిర్ణీత షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు. కాగా, గురువారం సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీల్ల దీపక్‌ బైజ్‌, డీకే సురేశ్‌, నకుల్‌ నాథ్‌‌లు ఉన్నారు. ఈ ముగ్గురు సభ్యులు సభలో అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంటూ వారిపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 
 
దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకూ లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 100కి చేరింది. అలాగే, ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146గా ఉంది. మరోవైపు, లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగానే లోక్‌సభ సమావేశాలను ముగించారు.
 
కాగా, గురువారం సభా కార్యక్రమాలు ప్రారంభంకాగానే, పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై ఈ ముగ్గురు ఎంపీలు నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా వారికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఈ ముగ్గురు ఎంపీల సస్పెన్షన్‌కు సంబంధించి తీర్మానం చేయడంతో ఈ ముగ్గురు ఎంపీలపై వేటు పడింది.