బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (16:55 IST)

కోతి చేతిలో ఓడిపోయిన ప్రజలు.. ఎలా?

ఓ వానరం దెబ్బకు ఓ గ్రామంలోని ప్రజలంతా తమ ఇళ్లు ఖాళీ చేసి పారిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని సీర్గాళికి సమీపంలో తెన్నల్‌కుడి ఊరిలో కన్నికోయిల్ వీధిలో దాదాపు 60 కుటుంబాల ప్రజలు నివశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఊరికి ఓ కోతి వచ్చింది. ఈ కోతి తన చేష్టలతో హంగామా చేయడం, ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం వంటి పనులు చేయసాగింది. ఎవరైనా అడ్డుకోబోతే... వారిపై దాడి చేయసాగింది. ఇలా ఈ కోతి దాడిలో గాయపడిన వారు 20 మందికి పైగానే ఉన్నారు. 
 
అంతేకాదు మనుషులతోపాటు గ్రామంలోని పశువులపై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో తోపాటు భయాందోళనకు గురయ్యారు. కోతిని పట్టుకుని తమను దాని బారి నుంచి కాపాడాలంటూ అటవీ శాఖ అధికారులను కోరారు.
 
వానరాన్ని పట్టుకునేందుకు అధికారులు కన్నికోవిల్‌ వీధిలో బోన్లను ఏర్పాటు చేశారు. అయినా అది చిక్కక పోగా… దాని ఆగడాలు మరింత ఎక్కువ కావడంతో స్థానికులు అన్నీ సర్ధుకుని,ఇళ్లకు తాళాలు వేసి గ్రామాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈ కోతి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న అటవీశాఖ అధికారులు ఆ వానరాన్ని బంధించే పనిలో నిమగ్నమయ్యారు.