మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (17:25 IST)

దేశంలో నిమ్న వర్గాలపై కొనసాగుతున్న వివక్ష : మోహన్ భగవత్

mohan bhagwat
మన సమాజంలో నిమ్నవర్గాలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ అన్నారు. అందువల్ల దేశంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తరం వృద్ధాప్యానికి చేరుకునేలోపే అఖండ భారత్ వాస్తవరూపం దాలుస్తుందన్నారు. 1947లో మన దేశం నుంచి విడిపోయిన వారిలో ఇప్పుడు తప్పు చేశామన్న భావనలో ఉన్నారని గుర్తు చేశారు.
 
'మన సాటి వారినే మనం వెనక్కు నెట్టేశాం. వారిని పట్టించుకోలేదు. ఇది ఏకంగా 2 వేల ఏళ్ల పాటు సాగింది. వారికి సమానత్వం కల్పించే వరకూ కొన్ని ప్రత్యేక ఉపశమనాలు కల్పించాల్సిందే. రిజర్వేషన్లు ఇందులో భాగమే. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. 
 
రెండు వేల ఏళ్ల పాటు కొన్ని వర్గాలు వివక్షను ఎదుర్కొన్నాయి. వారి మేలు కోసం ఓ 200 సంవత్సరాల పాటు మనం చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేమా? అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మనకు కనిపించకపోయినా సమాజంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. సమాజంలో వివక్ష కొనసాగుతుందని మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.