ఆయన తల పగలగొట్టండి.. గో ఫస్ట్ విమానం రద్దు కావడంతో ప్రయాణికుల ఆగ్రహం
గోవా విమానాశ్రయంలో ప్రయాణికులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. గోవా నుంచి ముంబైకు శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు వెళ్లాల్సిన గో ఫస్ట్ విమానం రద్దు అయింది. ఈ విషయాన్ని విమానం బయలుదేరే సమయానికి పది నిమిషాల ముందు విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు. దీంతో అంతవరకు వేసివున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమాన సంస్థ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
విమానం బయలుదేరడానికి సరిగ్గా 10 నిమిషాల ముందు ఈ విషయం చెప్పడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం రద్దు కావడంతో 80 మందికిపై ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకునిపోయారు.
ప్రయాణికులు విమాన సంస్థ అధికారులతో మాట్లాడుతున్న వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ప్రయాణికుడు అయితే, గో ఫస్ట్ సంస్థ అధికారి తల పగలగొట్టండి అంటూ బిగ్గరగా అరుస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. చివరకు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు మరో ప్రత్యామ్నాయ విమానం ఆ ప్రయాణికులతో బయలుదేరివెళ్లింది. ఈ ఘటన గోవా విమానాశ్రయంలో చోటుచేసుకుంది.