బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (11:20 IST)

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్న విజయ్ మాల్యా?

దేశం విడిచి పారిపోయిన ఆర్థికనేరగాడు విజయ్ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న గగన సఖి పింకీ లాల్వానీని ఆయన వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.

దేశం విడిచి పారిపోయిన ఆర్థికనేరగాడు విజయ్ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న గగన సఖి పింకీ లాల్వానీని ఆయన వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. 
 
దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.9,000 కోట్ల రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విలాస పురుషుడు విజయ్‌ మాల్యా. ఈయన ప్రస్తుతం లండన్‌కు పారిపోయి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. 62 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్నాడు. 
 
ఇంతకీ ఆయన మూడో పెళ్లి చేసుకోనున్న మహిళ ఎవరో తెలుసుకుందాం. పింకీని 2011లో విజయ్‌ మాల్యా తొలిసారి కలిశారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఆమెకు గగనసఖి (ఎయిర్‌హోస్టెస్‌)గా ఆయనే ఉద్యోగం ఇచ్చారు. క్రమేణా వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. తర్వాత అది ప్రేమగా మారింది. తరచూ పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి పాల్గొనేవారు. కొన్నేళ్ల తర్వాత సహజీవనం కూడా చేశారు. 
 
ఇటీవలే తమ ప్రేమ బంధానికి మూడేళ్లు నిండిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవం కూడా జరుపుకొన్నారు. విజయ్‌ మాల్యా వాళ్ల అమ్మతోనూ పింకీకి మంచి అనుబంధమే ఉంది. విజయ్‌ మాల్యాకు తొలి నుంచి తనదైన శైలిలో మద్దతు ఇస్తోంది పింకీ. లండన్‌కు పారిపోయే సమయంలో విమానంలో ఆయన పక్క సీట్లోనే ఆమె ఉందని ఓ ప్రచారం ఉంది. ఆయన కష్టసుఖాల్లో తోడుండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరూ లండన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
 
కాగా, విజయ్ మాల్యాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య సమీరా త్యాబ్జీ. ఈమె ఎయిర్‌ ఇండియాలో మాజీ గగన సఖినే. సిద్ధార్థ్‌ మాల్యా పుట్టిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆరేళ్లకు చిన్ననాటి స్నేహితురాలు రేఖను మాల్యా వివాహం చేసుకున్నారు. అప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకున్న రేఖకు ముగ్గురు పిల్లలు. వారి సంరక్షణ బాధ్యతలు తానే చూసుకుంటానని మాల్యా హామీ ఇవ్వడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీళ్లిద్దరి సంతానమే లియానా, తాన్యా.  మాల్యా మినహా వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. రేఖ-మాల్యా అధికారికంగా ఇంకా విడాకులు తీసుకోలేదని సమాచారం.