మంగళవారం, 28 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (16:38 IST)

ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు అదనంగా వసూలు చేస్తున్నారా?

aadhaar
ఆధార్ కార్డులో మార్పులు చేర్చులకు కేంద్రం మరోమారు అవకాశం కల్పించింది. దీంతో పాటు కొత్తగా నమోదుతోపాటు బయోమెట్రిక్ అప్‌డేట్, పేరు, చిరునామాల్లో మార్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
 
ఇదే అదునుగా పలు ఆధార్‌ కేంద్రాల్లో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌ నమోదు విషయంలో వసూలు చేసే ప్రతి రుసుంపై రూ.25 అదనంగా పెంచింది. అక్టోబరు ఒకటి నుంచి ఇవి అమల్లోకి రాగా ప్రతి కేంద్రంలోనూ రుసుముల ఛార్టులను ప్రజలకు తప్పనిసరిగా కనిపించేలా ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. 
 
నూతన ఛార్జీలు ఇలా.. 
కొత్తగా ఆధార్‌ నమోదు ప్రక్రియను ఉచితంగా చేస్తారు. 5 నుంచి 7, 15 నుంచి 17 సంవత్సరాల వారికి బయోమెట్రిక్‌ అప్డేట్‌‌ను కూడా ఉచితంగా చేస్తారు. పేరు, చిరునామా, పుట్టినతేదీ, జెండర్, చరవాణి సంఖ్య, ఈమెయిల్‌ ఐడీ నమోదు కోసం రూ.75 డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌ కోసం రూ.75 చొప్పున వసూలు చేయనున్నారు. .
 
అలాగే, 17 ఏళ్లు పైబడినవారికి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కోసం రూ.125, ఇంటికి వచ్చి ఆధార్‌ నమోదు, అప్డేట్‌ కోసం రూ.700, అదే ఇంట్లో మరో వ్యక్తి ఆధార్‌ నమోదుకు రూ.100 నుంచి రూ.350, ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, ప్రింట్‌ తీసుకోవడం కోసం రూ.40  చొప్పున వసూలుచేస్తారు.
 
ఒక వేళ్ల నిర్దేశించిన మొత్తాల కంటే ఆధార్‌లో మార్పు చేర్పులకు ఛార్జీలను ఎక్కువగా తీసుకుంటే 1947 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. [email protected] మెయిల్‌ ద్వారా కంప్లైంట్‌ ఇవ్వవచ్చు. https://resident.uidai.gov.in/file-complaint  ద్వారా నేరుగా కూడా తెలపవచ్చు.