ఆదివారం, 30 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (09:29 IST)

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

marriage with lover
అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ఆమె ప్రియుడుతో దగ్గరుండి మరో పెళ్లి చేశారు. అలాగే, తన ఇద్దరు పిల్లల పోషణ భారాన్ని తాను తీసుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్‌ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కటక్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూ అనే వ్యక్తి గత 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధిక అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్, శివానీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఉద్యోగ రీత్యా బబ్లూ నిత్యం కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వికాస్ అనే యువకుడుతో రాధిక వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
వీరి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న బబ్లూ... వారిపై ఆగ్రహం చెందడానికి బదులు.. ప్రశాంతంగా ఆలోచన చేసి.. ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. వారిద్దరినీ దనీనాథ్ శివాలయానికి తీసుకెళ్లి... తన భార్యకు, ఆమె ప్రియుడికి కలిసి వివాహం జరిపించారు. అంతేకాకుండా తన ఇద్దరి పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని, ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పడంతో పెళ్లికొచ్చి వారాంతా బబ్లూ మంచి మనసుకు ఫిదా అయిపోయారు. 
 
అలాగే, దగ్గరుండి వికాస్, రాధికలకు పూలదండలు మార్పించారు. అయితే, పూలదండలు మార్చుకునే సమయంలో రాధిక వెక్కివెక్కి ఏడుస్తుంటే ప్రియుడు వికాస్ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే, భార్య సంతోషం కోసం బబ్లూ చేసిన త్యాగాన్ని స్థానికులు కొనియాడుతుంటే మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. పిల్లల భవిష్యత్‌ను చూడకుండా పిచ్చిపని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.