మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (09:56 IST)

భర్త వీర్యంపై కూడా భార్యకే సర్వహక్కులు : కోల్‌కతా హైకోర్టు తీర్పు

భర్త సంపాదించిన ఆస్తుపాస్తులే కాదు ఆయన వీర్యంపై కూడా సర్వ హక్కులు భార్యకే ఉంటాయని కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. ముఖ్యంగా, భర్త నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యంపై సర్వహక్కులు భార్యకే ఉంటాయని, ఈ విషయంలో తండ్రికి ఎలాంటి హక్కులు ఉండబోవని స్పష్టం చేసింది. భర్త మరణించే వరకు అతడితో వైవాహిక బంధాన్ని కొనసాగించడం వల్ల, అతడి వీర్యంపై అన్ని హక్కులు భార్యకే ఉంటాయని తేల్చి చెప్పింది.
 
తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాకు చెందిన వ్యక్తికి తలసేమియా వ్యాధి ఉండటంతో  భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు వీలుగా అతడి నుంచి వీర్యాన్ని సేకరించి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో భద్రపరిచారు. 
 
ఆ తర్వాత కొన్నాళ్లకే అతడు మరణించాడు. దీంతో భద్రపరిచిన కుమారుడి వీర్యాన్ని సొంతం చేసుకునేందుకు అతడి తండ్రి ప్రయత్నించాడు. దాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. అతడి భార్య అనుమతి కూడా ఉంటే తప్ప ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
 
దీంతో ఆయన కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. కుమారుడి వీర్యాన్ని ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అలా ఇవ్వడం కుదరదని పేర్కొంది. కుమారుడి వీర్యాన్ని తీసుకునేందుకు పిటిషనర్‌కు ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య తీర్పు చెప్పారు. 
 
భద్ర పరిచిన వీర్యం మృతుడిదని, భర్త మరణించే వరకు అతడితో వైవాహిక సంబంధాన్ని కొనసాగించింది కాబట్టి దానిపై సర్వ హక్కులు భార్యకే ఉంటాయన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రాథమిక, చట్టబద్ధ హక్కుల ఉల్లంఘన లేదని, కాబట్టి ఈ అంశం న్యాయస్థానాల పరిధిలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది.